'శంకరాభరణం' రాజ్యలక్ష్మి అనగానే చీరలో సంప్రదాయబద్ధంగా, ఒద్దికగా కనిపించే రూపమే మనకు గుర్తుంటుంది. అలాంటి ఆమె మోడ్రన్ డ్రస్సులో బయటకు వస్తే ఎవరైనా గుర్తుపడతారా? ఇప్పుడు కాదు కానీ, కొంత కాలం క్రితం వరకూ రాజ్యలక్ష్మి మోడ్రన్ దుస్తుల్లోనే బయట తిరిగేవారు. అలా ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఒక తమాషా అయిన సంఘటన జరిగింది.
ఆమె మద్రాసులో ఉంటున్న రోజుల్లో 'పెళ్లిచూపులు' అనే టీవీ సీరియల్‌లో నటించారు. దాని షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. అప్పటివరకూ ఆమె సినిమాల్లో చీరకట్టులోనో లేదా లంగా ఓణీల్లోనో అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించేవారు. ఆరోజు ఆమె మోడరన్ దుస్తుల్లో చేతిలో గాగుల్స్, ఒక తెలుగు నవల పట్టుకొని ఫ్లైట్‌లో కూర్చున్నారు. ఆమె పక్క సీట్లో కాలేజీ స్టూడెంట్‌లా కనిపిస్తున్న అమ్మాయి కూర్చుంది.
కొంతసేపటికి ఆ అమ్మాయి నవల చదువుతూ ఉన్న రాజ్యలక్ష్మితో "మీరు తెలుగువారేనా?" అనడిగింది.
"అవునండీ" అంది రాజ్యలక్ష్మి.
"మీదేవూరు? ఎక్కడ్నుంచి వస్తున్నారూ?" అడిగింది ఆ అమ్మాయి.
"మాది తెలుగుప్రాంతమే. ఇప్పుడు ఉంటున్నది మాత్రం మద్రాసులో." చెప్పింది రాజ్యలక్ష్మి.
"ఎన్నాళ్ల నుంచీ అక్కడుంటున్నారు?" ఆ అమ్మాయి ప్రశ్న.
"తొమ్మిదేళ్లకు పైగా." రాజ్యలక్ష్మి సమాధానం.
"మీరేదైనా కాలేజీలో చదువుతున్నారా?" అడిగింది అమ్మాయి.
"అబ్బే లేదండీ." చెప్పింది రాజ్యలక్ష్మి.
"హైదరాబాద్‌లో ఎక్కడుంటారు?" మళ్లీ అమ్మాయి ప్రశ్న.
"హోటల్‌లో." రాజ్యలక్ష్మి జవాబు.
"మీ పేరు?" అడిగింది అమ్మాయి.
"రాజ్యలక్ష్మి" చెప్పింది రాజ్యలక్ష్మి.
ఇలా ఇద్దరి మధ్యా సంభాషణ నడిచింది. ఆ తర్వాత రాజ్యలక్ష్మి ఆ అమ్మాయి వివరాలు అడిగింది. ఆమె చెప్పింది. అన్ని విషయాలు చెప్పినా రాజ్యలక్ష్మిని ఆ అమ్మాయి పోల్చుకోలేకపోయింది.
చివరకు, "మీరేం చేస్తుంటారు?" అనడిగింది అమ్మాయి.
"సినిమాల్లో నటిస్తుంటాను." జవాబచ్చింది రాజ్యలక్ష్మి.
వెంటనే, "సినిమాల్లో యాక్ట్ చేసే రాజ్యలక్ష్మి మీరేనా.. సారీ.. పోల్చుకోలేకపోయాను. సాధారణంగా సినిమాల్లో మిమ్మల్ని చీరకట్టులో చూస్తుంటాం కదా. సడన్‌గా మీరు మోడ్రన్ డ్రస్‌లో కనిపించేసరికి పోల్చుకోలేకపోయాను." అంది ఆ అమ్మాయి ఆశ్చర్యపోతూ.
"ఫర్వాలేదు. మోడ్రన్ డ్రస్‌లో మీరే కాదు, ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు. అందుకే నేనెక్కువగా మోడ్రన్ దుస్తుల్లోనే బయటకు వెళ్తుంటాను." అని చెప్పింది రాజ్యలక్ష్మి.
"సారీ అండీ.. మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను." మళ్లీ నొచ్చుకోలుగా అందా అమ్మాయి.
"అదేనండీ నాకు కావాల్సింది. అప్పుడే కదా.. నా గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోగలను." అంది రాజ్యలక్ష్మి చిన్నగా నవ్వుతూ.